30, జులై 2013, మంగళవారం

పండిత జగన్నాథరావు - ఏకసంథాగ్రాహి కన్నా గొప్పవాడు.


ఇవాళ ఎంతో శుభదినం. మా నల్లనయ్య కృపాకటాక్షాల వల్ల బహుళ శాస్త్ర పారంగత శ్రేష్ఠులు శ్రీ అహోబిలవఝ్ఝల మురళి గారితో సంభాషించే అదృష్టం లభించింది. వారు చెప్పిన ఒక అసాధారణ ధారణ గల వ్యక్తి చరిత్ర మీతో పంచుకుంటా. . . .
జగన్నాథపండితరాయలు అని సంస్కృత పండితుడు కోనసీమలో ఉండేవారుట. ఈయన ఉత్రరదేశయాత్రకి బయలుదేరి వెళ్తున్నారుట. అవి ఢిల్లీని పాదుషాలు పాలిస్తున్న రోజులు. ఆ రోజుల్లో అందరు సామాన్యంగా కాలినడకన వెళ్ళేవారు కదా అలానే వారు వెళ్తున్నారు. అలా అక్కడ నడుస్తుండగా బాగా ఎండగా ఉందని ఒక చెట్టు కింద ఆగారు. ఆ పక్కనే ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. అలా ఆ గొడవ పాదుషా దర్బారుకి వెళ్ళింది. ప్రత్యక్ష సాక్షులు ఎవరేనా ఉన్నారా అంటే. ఒక బ్రాహ్మణుడు చెట్టు కింద ఉన్నాడు అని చెప్పారు. రౌతులు గుర్రాలమీద వెళ్ళి వీరిని పట్టుకొని పాదుషా ఎదుట హాజరు పరచారు. అరబ్బీ పారశీకాలు కలిసిన అప్పటి వాడుక భాషలో రైతులు దెబ్బలాడుకున్నారు. వీరికి మాతృ భాష తెలుగు పండిత భాష సంస్కృతం వచ్చు కాని ఆ భాష రాదు. అదే విషయం వివరించి, భాష రాకపోయిన వారు మాట్లాడుకున్న శబ్దాలు యధాతథంగా అప్పజెప్పారు. ఆహా ఏం ధారణాశక్తి, ఏం ఙ్ఞాపకశక్తి.
ఆ మహా పండితుడు పిమ్మట ముస్లిం స్త్రీ లవంగిని వివాహమాడారు, అనేక గొప్ప రచనలు రాశారట.
ఏకాసంథాగ్రాహి అని ఒక్కొక్కళ్ళు ఉంటా రని విన్నా కాని, ఇంత గొప్ప ఙ్ఞాపక శక్తి, ధారణ వినటం కాదు ఊహించను కూడ ఊహించ లేదు. మరి వీరి ఐక్యూ ఎలా లెక్కపెట్టాలో?

29, జులై 2013, సోమవారం

తెలుగు భాగవత తేనె సోనలు_11

10.1-307-క.
బాలురకుఁ బాలు లే వని  
బాలింతలు మొఱలుపెట్టఁ కపక నగి యీ  
బాలుం డాలము చేయుచు  
నాకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!   
      గోపికలు బాలకృష్ణుని అల్లరి యశోదకు ఇలా పిర్యాదు చేస్తున్నారు. కమలలాంటి కన్నులున్న అమ్మా. అసలే పిల్లలకి తాగటానికి పాలు సరిపోటం లే దని పసిపిల్లల తల్లులు  గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ ఆవులకు లేగదూడల తాళ్ళువిప్పి వదిలేస్తున్నాడు చూడమ్మ.
ఙ్ఞానముచే కలిగిన దృష్టి కలామె అంభోజాక్షి. గోపికలు అంటే ముముక్షువులు. బాలు రంటే అఙ్ఞానులు. బాలింతలు అంటే వారిని పోషించే ఙ్ఞానప్రదాతలు. వారు అఙ్ఞానులకి సరిపడినంత మోక్షం అనే పాలు అందటం లేదని తపిస్తున్నారట. ఎందుకంటే, బలం అంటే శక్తికి కారణభూతుడైన ఈ బాలుడు వేదాలు అనే ఆవులకి  మోక్షాపేక్ష గల వా రందరిని వదిలేస్తున్నా డట.
        బాలురకుఁ బాలు లేవని - బాలురు = పిల్లల; కున్ = కి; పాలు = తాగుటకు పాలు; లేవు = లేవు; అని = అని; బాలింతలు = పసిబిడ్డల తల్లులు; మొఱలుపెట్టఁ బకపక - మొఱలుపెట్టన్ = మొత్తుకొనగా; పకపక = పకపక అని; నగి = నవ్వి; యీ - = ; బాలుం డాలము - బాలుండు = పిల్లవాడు; ఆలమున్ = అల్లరి పెట్టుట, పరిహాసము; చేయుచు నాలకుఁ గ్రేపులను - చేయుచున్ = చేస్తూ; ఆల = ఆవుల; కున్ = కు; క్రేపులను = దూడలను; విడిచె నంభోజాక్షీ - విడిచెన్ = వదలిపెట్టెను; అంభోజాక్షీ = సుందరీ {అంబోజాక్షి నీటిలో పుట్టిన పద్మాల్లాంటి కన్ను లున్నామె, స్త్రీ}.

 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

27, జులై 2013, శనివారం

తెలుగు భాగవత తేనె సోనలు_9

10.1-26-ఉ.
                   న్నవు నీవు చెల్లెలికి; క్కట! మాడలు చీర లిచ్చుటో?
                   మన్నన చేయుటో? మధుర మంజుల భాషల నాదరించుటో?
                  ‘మిన్నుల మ్రోతలే నిజము, మేలని చంపకు మన్న మాని రా
                   వన్న! సహింపు మన్న! తగ న్న! వధింపకు మన్న! వేడెదన్.
10.1-26-u. 
“annavu niivu chelleliki; nakkata ! mAdalu chiira lichchutO?
Mannana cheEyutO? maDHura maMjula Bhaashala naadhariMchutO?
‘Minnula mrOthalE nijamu, mE’ lani chaMpaku manna mAni rA
Vanna ! sahiMpu m exianna ! thaga dhanna ! vaDhiMpaku manna ! vEdedhan.

కంసుడు ఆకాశవాణి పలుకులు విని చెల్లి దేవకిని చంపబోతుంటే. వసుదేవుడు అతనిని శాంత పరచే సందర్భంలో దీపద్యం. 
           బావ! ఈ అబల చెల్లెలు నువ్వు అన్నవు కదా! ధనం, బట్టలు లాంటి  బహుమతు లివ్వాలి. ఆడబడచు అంటు గౌరవించాలి.  మృదు వైన మాటలతో ఆదరించాలి కదయ్య. అంతేగాని, అయ్యో! ఇదేం టయ్య? గాలి మాటలే నిజ మని నమ్మి ఈ అమాయకురాలిని వధించబతున్నావు. ఆమెని వదలి పెట్టు. ఓర్పు వహించు. ఈ పని నీకు తగదయ్య. వేడుకుం టున్నాను ఈమెను చంపకయ్య.
             అన్నవు = జ్యేష్టభ్రాతవు; నీవు - నీవున్ = నీవు; చెల్లెలికి నక్కట - చెల్లెలి = ఆడబడుచున; కిన్ = కి; అక్కట = అయ్యో; మాడలు = బంగారు బిళ్ళలు; చీర లిచ్చుటో - చీరలు = కోకలు; ఇచ్చుటో = ఇవ్వడం కాని; మన్నన = గౌరవించుట; చేయుటో = చేయటం కాని; మధుర = తియ్యని; మంజుల = మృదు వైన; భాషల నాదరించుటో - భాషలన్ = మాటలతో; ఆదరించుటో = ఆదరించుటకాని అంతేకాని; మిన్నుల = ఆకాశ; మ్రోతలే = పలుకులే; నిజము = సత్యములు; మే లని - మేలు = సరియైనవి; అని = అనుకొని; చంపకు మన్న - చంపకు = సంహరింపకము; అన్న = అయ్య; మాని = ప్రయత్నము విరమించి; రావన్న - రావు = వెనుకకు రమ్ము; అన్న = అయ్య; సహింపు మన్న - సహింపుము = ఓర్పు వహించుము; అన్న = తండ్రి; తగ దన్న - తగదు = తగినపని కాదు; అన్న = నాయనా; వధింపకు మన్న - వధింపకుము = చంపకుము; అన్న = అయ్య; వేడెదన్ - వేడెదన్ = ప్రార్థించు చుంటిని.
  తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/

 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

25, జులై 2013, గురువారం

చను నీకు గుడుపఁజాలెడి. . . . .

Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం: తెలుగు భాగవత తేనె సోనలు_8: 10.1-220- క. “ చ ను నీకు గుడుపఁజాలెడి చ ను వారలు లేరు ; నీవు చ నవలె ” ననుచుం “ జ నుఁ గుడుపి మీఁద నిలుకడఁ జ ను దాన ” ననంగ వేడ్కఁ ...

23, జులై 2013, మంగళవారం

తెలుగు భాగవత తేనె సోనలు_6

7-166-క.
                  "దివించిరి నను గురువులు
                    చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నేఁ
                    జదివినవి గలవు పెక్కులు
                    చదువులలో మర్మ మెల్లఁ దివితిఁ దండ్రీ!
గురువుల దగ్గర యేం నేర్చుకొన్నా వని అడిగిన తండ్రి హిరణ్యాక్షునికి ప్రహ్లాదుడు సమాధానం చెప్తున్నాడు. నాన్నగారు! నాచే ఈ గురువులు ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మొదలైన సర్వ శాస్త్రాలు చక్కగా వల్లెవేయించారు. అలా ఎన్నో శాస్త్రాలు నేర్చుకొన్నాను. సర్వ శాస్త్రాల రహస్య సారాన్ని పరమార్థాన్ని ఆకళింపు చేసుకొన్నాను.
చదివించిరి = చదివించిరి; నను - ననున్ = నన్ను; గురువులు = గురువులు; చదివితి = చదివితిని; ధర్మార్థముఖ్య = ధర్మార్థకామ; శాస్త్రంబులు - శాస్త్రంబులున్ = శాస్త్రములను; నేఁ జదివినవి గలవు - నేన్ = నేను; చదివినవి = చదివినట్టివి; కలవు = ఉన్నవి; పెక్కులు = అనేకమైనవి; చదువులలో - చదువుల = చదువుల; లోన్ = అందలి; మర్మమెల్లఁ జదివితిఁ దండ్రీ - మర్మములు = రహస్యములు; ఎల్లన్ = అన్నిటిని; చదివితిన్ = చదివితిని; తండ్ర్రీ = తండ్రి.
  తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/
 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

22, జులై 2013, సోమవారం

తెలుగు భాగవత తేనె సోనలు_5

7-150-సీ.
మందార మకరంద మాధుర్యమునఁ; దేలు ధుపంబు బోవునే దనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు; రాయంచ జనునె తరంగిణులకు?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు; కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక; మరుగునే సాంద్ర నీహారములకు?  
తే. నంబుజోదర దివ్య పాదారవింద
చింత నామృత పాన విశేష మత్త
చిత్త మే రీతి నితరంబుఁ జేర నేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"
        తండ్రి హిరణ్యాక్షుడు హరి గిరి అనకు అన్నాడు. ప్రహ్లాదుడు నీతిశాలి కదా. గురువు చండామార్కుల వారికి సమాధానం చెప్పాడు. వినుతగుణశీల అని సంబోధించాడు. ఆ సందర్భంలోది ఈ అమృత గుళిక. 
ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో ఆ విష్ణుదేవుని దివ్య మైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, ఆ అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశిస్తు ఉంటుంది నా మనస్సు. మరి మందార పూల మకరందంలోని మాధుర్యం  మరిగిన తుమ్మెద ఉమ్మెత్తపూల వైపు పోదుగదా. స్వచ్చ మైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగులు వంకల దగ్గరకు చేరదు కదా. తియ్య మామిడి లేత చిగుర్లు తిని పులకించి  పాటలుపాడే కోకిల కొడిసిచెట్ల పైకి వెళ్ళదు కదా. నిండు పున్నమి వెన్నెలలో విహారాలు చేసే చకోర పక్షి దట్టమైన మంచు తెరల మాటుకి పోదుకదా. అలాగే ఇతర విషయాల పైకి నా చిత్తం వెళ్ళదు. 
మందార మకరంద మాధుర్యమునఁ దేలు - మందార = మందారము యొక్క; మకరంద = పూతేనె యొక్క; మాధుర్యమునన్ = తీయదనము నందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు బోవునే - మధుపంబు = తుమ్మెద; పోవునే = వెళుతుందా; మదనములకు - మదనముల = ఉమ్మెత్తపూల; కున్ = కు; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ వీచికలఁ దూఁగు - మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగములందు; తూగు = ఊగెడి; రాయంచ జనునె - రాయంచ = రాజ హంస; చనునె = పోవునా; తరంగిణులకు - తరంగిణుల్ = (సాధారణ) ఏరుల; కున్ = కు; లలిత రసాల పల్లవ ఖాది యై - లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాది = తినునది; = అయ్యుండి; చొక్కు = మై మరచెడి; కోయిల = కోయిల; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కుటజములకుఁ బూర్ణేందు చంద్రికా - కుటజముల = కొండమల్లె, కొడిసెచెట్ల; కున్ = కు; పూర్ణేందు = నిండుజాబిల్లి; చంద్రికా = వెన్నల; స్పురిత చకోరక మరుగునే - స్పురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్లునా ఏమి; సాంద్ర నీహారములకు నంబుజోదర - సాంద్ర = దట్టమైన; నీహారముల్ = మంచుతెరల; కున్ = కు; అంబుజోదర = నారాయణుని {అంబు జోదరుడు - అంబుజము (పద్మము) ఉదరుడు (పొట్టనగలవాడు), విష్ణువు}. 
దివ్య పాదారవింద - దివ్య = దివ్యమైన; పాద = పాదము లనెడి; అరవింద = పద్మముల; చింత నామృత పాన విశేష మత్త - చింతనా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; పాన = తాగుటచే; విశేష = మిక్కలిగా; మత్త = మత్తెక్కిన; చిత్త మేరీతి నితరంబుఁ జేర నేర్చు - చిత్తము = మనసు; = ; రీతిన్ = విధముగ; ఇతరము = వేరొంటిని; చేరన్ = చేరుటను; నేర్చున్ = చేయగలదా ఏమి; వినుత గుణశీల - వినుత = స్తుతింపదగిన; గుణ = సుగుణములుగల; శీల = వర్తనగలవాడ; మాటలు వేయు నేల - మాటలు = మాటలు చెప్పుట; వేయున్ = అనేకము; ఏలన్ = ఎందులకు.
తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/

 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||