22, జులై 2013, సోమవారం

చదవని వా డఙ్ఞుం డగు . . .. .

Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం: 
తెలుగు భాగవత తేనె సోనలు_
4- 7-130- క. "చదు వనివాఁ డఙ్ఞుం డగు జదివిన సదసద్వివేక చతురత గలుగుం జదువఁగ వలయును జనులకుఁ జదివించెద నార్యు లొద్ధఁ జ...

21, జులై 2013, ఆదివారం

తెలుగు భాగవత తేనె సోనలు_3

1-5-ఉ.
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి దోషభేదికిఁ బ్రపన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జన నంద వేదికిన్
మోదకఖాదికిన్ సమద మూషక సాదికి సుప్రసాదికిన్.
        తన తల్లి పర్వత పుత్రి యైన పార్వతీదేవి మనస్సులో అనురాగ మనే సంపద సంపాదించినవాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు. ఆశ్రితులకు సంతోషం కలిగించేవాడు, సమస్తమైన విఘ్నా లనే తాళ్ళను భేదించేవాడు, మనోఙ్ఞంగా మాట్లాడేవాడు, భక్తులకు సర్వలోకస్తులకు ఆనంద ప్రదాత, మోదం కలిగించే ఉండ్రాళ్ళను తృప్తిగా ఆరగించేవాడు, చక్కటి మూషిక వాహను డైనవాడు, మోదప్రదాయకుడు అయిన  వినాయకునికి వంగి వందనాలు చేస్తాను.
        ఆదరమొప్ప - ఆదరము = మన్నన; ఒప్పన్ = ఉట్టిపడేలా; మ్రొక్కిడుదు నద్రిసుతా హృద యానురాగ సంపాదికి - మ్రొక్కున్ = నమస్కారమును; ఇడుదున్ = పెట్టెదను; అద్రి = పర్వత; సుతా = పుత్రి; హృదయ = హృదయ; అనురాగ = అనురాగాన్ని; సంపాది = సంపాదించినవాడు; కిన్ = కి; దోషభేదికిఁ బ్రపన్న వినోదికి - దోష = పాపాలని; భేది = పోగొట్టేవాడు; కిన్ = కి; ప్రపన్న = శరణాగతులైన భక్తులకు; వినోది = సంతోషము కలిగించు వాడు; కిన్ = కి; విఘ్నవల్లికాచ్ఛేదికి - విఘ్న = విఘ్నాల; వల్లికా = సమూహమును; చ్ఛేది = నాశనముచేసే వాడు; కిన్ = కి; మంజువాదికినశేషజగజ్జననందవేదికిన్ - మంజు = మనోజ్ఞముగ; వాది = మాట్లాడే వాడు; కిన్ = కి; అశేష = అనేక; జగత్ = లోకములందలి; జన = జనులకు; నంద = ఆనందము; వేది = కలిగించే వాడు; కిన్ = కి; మోదకఖాదికిన్ - మోదక = ఉండ్రాళ్ళు; ఖాది = తిను వాడు; కిన్ = కి; సమదమూషకసాదికి - సమద = చక్కగ; మూషక = ఎలుక; సాది = నడిపే వాడు; కిన్ = కి; సుప్రసాదికిన్ - సుప్రసాది = మంచి నిచ్చే వాడు; కిన్ = కి.
 || ఓం నమో భగవతే వాసుదేవాయః ||

19, జులై 2013, శుక్రవారం

తెలుగు భాగవత తేనె సోనలు_2



1-3-ఉ.
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతా నికర నేతకుఁ గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల తాపస లోక శుభ ప్రదాతకున్.
సమస్త చరాచర సృష్టి నిర్మాణం చేయడం సంపూర్ణంగా తెలిసిన వాడు, సరస్వతీదేవికి హృద యానంద ప్రదాత అయినవాడు, వేదాలన్నిటిని సమర్ధంగా సమకూర్చినవాడు,  సకల దేవతామూర్తులను తీర్చిదిద్దినవాడు, సమస్త పాపాలను పటాపంచలు చేసేవాడు, దీనుల దప్పక కాచువాడు. తపోధను లందరికి సుభా లొనగూర్చేవాడు అయినట్టి ఆ బ్రహ్మ దేవుని శ్రద్ధాభక్తులతో సేవిస్తాను.
1-3-ఉ. | ఆతతసేవఁజేసెద - ఆతత = అతిశయమైన; సేవన్ = భక్తిని; చేసెదన్ = చేసెదను; సమస్తచరాచరభూతసృష్టి విజ్ఞాతకు - సమస్త = సమస్తమైన; చర = చరములు; అచర = అచరములుయైన; భూత = ప్రాణులను; సృష్టి = సృష్టించే; విజ్ఞాత = నేర్పరి; కున్ = కి; భారతీహృదయసౌఖ్యవిధాతకు - భారతీ = భారతీ దేవి; హృదయ = హృదయానికి; సౌఖ్య = సంతోషాన్ని; విధాత = కలిగించేవాడు; కున్ = కి; వేదరాశినిర్ణేతకు - వేద = వేదాల; రాశి = సమూహాలను; నిర్ణేత = ఏర్పరిచిన వాడు; కున్ = కి; దేవతానికరనేతకుఁగల్మషజేతకున్ - దేవతా = దేవతల; నికర = సమూహము యొక్క; నేత = నాయకుడు; కున్ = కి; కల్మష = పాపములను; ఛేత్త = ఛేధించే వాడు; కున్ = కి; నతత్రాతకు - నత = నమస్కరించే వారిని; త్రాత = రక్షించే వాడు; కున్ = కి; ధాతకున్ - ధాత = బ్రహ్మ; కున్ = కి; నిఖిలతాపసలోకశుభప్రదాతకున్ - నిఖిల = మొత్తం; తాపస = తాపసులు; లోక = అందరికి; శుభ = శుభాలను; ప్రదాత = ఇచ్చేవాడు; కున్ = కి.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||

18, జులై 2013, గురువారం

తెలుగు భాగవత తేనె సోనలు_1

శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్.
        సర్వలోకాలను రక్షించేవానిని, భక్తజనులను కాపాడుటలో అత్యుత్సాహం గలవానిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవానిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వానిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) ముక్తిమార్గాన్ని అందుకోడానికి సదాస్మరిస్తు ఉంటాను. (బమ్మెర పోతనామాత్యుల ఈ ప్రార్థన తన మోక్షానికా ప్రజల మోక్షానికా ?) 
1-1-శా. | శ్రీకైవల్యపదంబుఁజేరుటకునై - శ్రీ = శుభకరమైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుట = పొందుట; కున్ = కోసము; ఐ = ఐ; చింతించెదన్ - చింతించు = ప్రార్థించు; ఎదన్ = ఎదన్; లోకరక్షైకారంభకు - లోక = లోకాలన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక = ముఖ్యమైన; ఆరంభ = సంకల్పమున్న వాడు; కున్ = కి; భక్తపాలనకళాసంరంభకున్ - భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళయందు; సంరంభ = వేగిరపాటున్న వాడు; కున్ = కిన్; దానవోద్రేకస్తంభకుఁగేళిలోలవిలసదృగ్జాలసంభూత నానాకంజాత భవాండ కుంభకు - దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసేవాడు; కున్ = కి; కేళి = ఆటలందు; లోల = వినోదాలందు; విలసత్ = ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వలనుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ; కంజాతభవాండ = బ్రహ్మాండముల {కంజాతభవాండ - కం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టినవాని(బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశితనలో కలిగిన వాడు; కున్ = కి; మహానందాంగనాడింభకున్ - మహా = గొప్ప; నంద = నందుని; అంగనా = భార్యయొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.
1-2-ఉ.#

వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్ దయా
శాలికి శూలికిన్ శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్
బాల శశాంక మౌళికిఁగ పాలికి మన్మథ గర్వ పర్వతో
న్మూలికి నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్. 
ఆపరాని తాండవ మాడేవానికి, మిక్కలి దయగలవానికి, పార్వతి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, శిరస్సున ధరించిన చంద్రరేఖ గల వానికి, కపాలధారికి, మన్మథుడి మహాగర్వాన్ని అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించేవానికి తగిలిన భక్తితో మొక్కుతాను.
1-2-ఉ. | వాలిన = అతిశయించిన; భక్తి = భక్తితో; మ్రొక్కెదనవారితతాండవకేళికిన్ - మ్రొక్కెదన్ = మ్రొక్కెదను; అవారిత = వారింపలేని; తాండవ = తాండవమనే; కేళి = ఆట ఆడే వాని; కిన్ = కి; దయాశాలికి - దయాశాలి = దయకలవాడి; కిన్ = కి; శూలికిన్ - శూలి = శూల ధారి; కిన్ = కి; శిఖరిజాముఖపద్మమయూఖమాలికిన్ - శిఖరి = పర్వతుని; జా = పుత్రికయొక్క; ముఖ = ముఖము అనే; పద్మ = పద్మానికి; మయూఖమాలి = సూర్యుడు {మయూఖమాలి - కిరణములు కలవాడు, సూర్యుడు}; కిన్ = కి; బాలశశాంకమౌళికిఁగపాలికి - బాల = లేత; శశాంక = చంద్రుని {శశాంక - శశ (కుందేలు) గుర్తు కలవాడు - చంద్రుడు}; మౌళి = శిరస్సున ధరించిన వాడు; కిన్ = కి; కపాలి = పుర్రె ధరించే వాడు; కిన్ = కి; మన్మథగర్వపర్వతోన్మూలికి - మన్మథ = మన్మథుని; గర్వ = గర్వమనే; పర్వత = పర్వతాన్ని; ఉన్మూలి = నిర్మూలించిన వాడు; కిన్ = కి; నారదాదిమునిముఖ్య - నారద = నారదుడు; ఆది = మొదలైన; ముని = ముని; ముఖ్య = ముఖ్యుల; మనస్సరసీరుహాలికిన్ - మనస్ = మనసులనే; సరసీరుహ = పద్మాలలోని {సరసీరుహ - సరస్సులో పుట్టినది, పద్యం; అలి = తుమ్మెద లాంటి వాడు; కిన్ = కి.